రావి చెట్టుకు మన పురాణాల్లో ఎంతో గుర్తింపు ఉంది. అదో అద్భుతమైన ఔషధ చెట్టు. దాని ఆకులతో కలిగే ప్రయోజనాల్ని తెలుసుకుందాం.
మొక్కలు మరియు చెట్లను పూజించడం హిందువుల సాంప్రదాయంలో భాగంగా వస్తూ ఉన్నది. తద్వారా వేప, తులసి, జమ్మి, రావి, మర్రి, మామిడి మొదలైన అనేక రకాల చెట్ల ఆకులను లేదా, వాటి ఫలాలను దైవ కార్యాలకు వినియోగించడం ఆనవాయితీగా వస్తున్నది. అందులో ముఖ్యంగా రావి చెట్టుని ప్రధానంగా చెప్పబడుతున్నది. రావి చెట్టు లేని గ్రామం, దేవాలయాలు అతి తక్కువగా కనిపిస్తాయి అంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ఆక్సిజన్ అధికంగా ఇచ్చే రావి చెట్టుని పెంచడం ద్వారా తెలీకుండానే సమాజ సేవకు పూనుకున్న అభిప్రాయం జనులది. గ్రామాలలో కూడా రావి చెట్టు కింద సేద తీరే పెద్దవారిని కూడా మనం గమనిస్తూ ఉంటాం. రావి చెట్లు అధికంగా ఉన్న ప్రాంతాలలో స్వచ్చమైన గాలి తో కూడా కాలుష్య జాడలు కాస్త తక్కువగా ఉంటాయి అనడంలో ఆశ్చర్యం లేదు.
మహా భారతంలో, కృష్ణుడు తనను తాను రావి చెట్టుగా అభివర్ణించినాడు. ఈ చెట్టు యొక్క మూలాలు విష్ణువు. దాని కాండం కేశవుడు. శాఖలు నారాయణ మరియు ఆకులు హరిగా స్వయంగా ఉన్నారు. అందువల్ల పూర్వ కాలం నుండే రావి చెట్టును ఆరాధించే సాంప్రదాయం ఉన్నది. సోమావతి అమావాస్య రోజున రావి చెట్టులో విష్ణు భగవానుడు, లక్ష్మి సమేతంగా కొలువు తీరి ఉంటారని నమ్ముతారు. పెళ్ళైన ఆడవారు ఈరోజు ఉపవాసం ఉండడం ద్వారా భర్తలకు ఆయురారోగ్యాలు సిద్దిస్తాయని , మరియు పితృదోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని విశ్వసిస్తుంటారు. ఈరోజు రావిచెట్టుకు ప్రత్యేకమైన పూజలు నిర్వహించి ప్రదక్షిణ చేయడం ఆనవాయితీ. దీనిని రావిచెట్టు ప్రదక్షిణ వ్రతంగా గుర్తిస్తారు కూడా. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమములో ఈ ఆకు ఒకటి.
పుట్టుక మరియు మరణాన్ని సూచిస్తుంది :
రావి చెట్టు ఎన్నడూ ఒకేసారి ఆకులను జారవిడువదు. ఆకులు పడిపోఏ కొలదీ కొత్త ఆకులు చిగురిస్తూ నూతన జన్మను తీసుకొంటాయి. ఇది జన్మ మరియు మరణ చక్రం అని సూచిస్తుంది. అందువలన దీనిని ఆధ్యాత్మిక వాస్తవికతకు సంబంధించిన చెట్టుగా భావిస్తుంటారు. చెట్టు యొక్క క్లిష్టమైన నిర్మాణం మొత్తo, జీవితం మరియు మరణ చక్రాన్ని సూచిస్తుంది. దీని ద్వారానే ప్రకృతి సైతం నడుస్తుంది అని చెప్పబడినది. కొందరి నమ్మకాల ప్రకారం ఈ భూమి మీద ఉన్న ప్రతి రావి చెట్టు ఆకు ఒక ప్రాణంగా చెప్పబడుతున్నది కూడా.
బుద్దుని జ్ఞానోదయం :
అనేక ఋషులు సన్యాసాన్ని స్వీకరించే క్రమంలో రావి చెట్టు క్రింద జ్ఞానోదయం సాధించారు. వారిలో గౌతమ బుద్దుడు అతిపెద్ద ఉదాహరణ. బుద్దుడు బీహార్ లోని గయలో ఒక నది దగ్గర ఉన్న రావి చెట్టు కింద కూర్చున్నారు. అతను పద్నాలుగవ రోజు సాయంత్రాన జ్ఞానోదయం పొందాడు. ఈ చెట్టుని మహాబోది వృక్షమని, ఆ ప్రదేశాన్ని బుద్ధగయగా పిలువబడింది. ఈ చెట్టు యొక్క శాఖ నుండి ఎదిగిన ఏ చెట్టునైనా కూడా బోధి వృక్షం అని పిలవడం ఆనవాయితీగా వస్తున్నది.
రావి చెట్టుతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు:
రావి చెట్టుకు ఉండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఈ చెట్టును పవిత్ర చెట్టుగా ఎందుకు భావిస్తారంటే... దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మలబద్ధకం, విరేచనాలు, నపుంసకత్వం, రక్త సంబంధ సమస్యలకు ఈ ఆకులు చెక్ పెడతాయి. ఎందుకంటే రావి ఆకులో గ్లూకోజ్, ఆస్టియోరిడ్, ఫినోలిక్ వంటి గుణాలున్నాయి. ఆ మాటకొస్తే... రావి చెట్టులో ప్రతీ భాగంలోనూ ఔషధ గుణాలున్నాయి. అందుకే ఈ చెట్టును రకరకాల వ్యాధుల్ని తరిమికొట్టేందుకు ఉపయోగిస్తున్నారు. ఓవైపు ఈ చెట్టుకు పూజలు చేస్తూనే... మరోవైపు... దీని ఆకులు, బెరడు, కాండం, విత్తనాలు, పండ్లను ఔషధాల తయారీలో వాడుతున్నారు. అనేక రోగాలను మాయం చేసే శక్తి రావి ఆకులకు ఉంది. ఆస్తమా, చర్మ వ్యాధులు, కిడ్నీ జబ్బులు, మలబద్ధకం, విరేచనాలు, లైంగిక సమస్యలు, పాము కాటు తదితర సమస్యలకు ఇది మందుగా ఉపయోగపడుతుంది.
డయేరియా మందు..
డయేరియా తగ్గడానికి రావి చెట్టు కాండం ఉపకరిస్తుంది. రావి చెట్టు కాండం, ధనియాలు, పట్టిక బెల్లం సమపాళ్లలో తీసుకొని బాగా మిక్స్ చేసి 3-4 గ్రాముల చొప్పున రోజుకు రెండుసార్లు తీసుకుంటే డయేరియా తగ్గుతుంది.
ఆకలి పెంచడానికి..
ఆకలి పెంచడానికి బాగా పక్వానికి వచ్చిన రావి పండ్లు ఉపయోగపడతాయి. వీటిని తినడం వల్ల దగ్గు, రక్త సంబంధ సమస్యలు, పిత్త దోషాలు, కడుపులో మంట, వాంతులు కూడా తగ్గుతాయి.
ఆస్తమాకు చక్కటి ఔషధం..
ఆస్తమాతో బాధపడుతున్న వారు రావి బెరడు, మగ్గిన పండ్లను తీసుకోవాలి. వాటిని విడిగా పొడి చేసి, సమాన మోతాదుల్లో కలపాలి. రోజుకు మూడుసార్లు దీన్ని తీసుకోవడం వల్ల ఆస్తమా తగ్గుతుంది. ఎండిన రావి పండ్లను పొడిగా చేసుకొని రోజూ రెండు పూటలా 2-3 గ్రాముల చొప్పున రెండు వారాలపాటు తీసుకోవాలి. ఇలా చేస్తే ఆస్తమా త్వరగా తగ్గుతుంది.
పాము కాటుకు మందుగా..
పాము కాటుకు గురైన వారికి రావి ఆకుల రసాన్ని రెండు స్పూన్ల చొప్పున మూడు నాలుగు సార్లు ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల విషం ప్రభావం తగ్గుతుంది.
చర్మ సమస్యలు తగ్గడానికి...
లేత రావి ఆకుల్ని తినడం వల్ల దురద సమస్యలు, ఇతర చర్మ వ్యాధులు తగ్గుతాయి. ఈ ఆకుల్ని మరిగించి 40 ఎం.ఎల్. మోతాదులో టీ రూపంలో తాగడం వల్ల మరింత ప్రయోజనం చేకూరుతుంది.
రావి బెరడుతో తామర మాయం..
రక్త శుద్ధి కోసం..
రక్త శుద్ధి కోసం కూడా రావి ఎంతగానో ఉపయోగపడుతుంది. రెండు గ్రాముల రావి గింజల పొడిని తేనెతో కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది.
మలబద్ధకం దెబ్బకు దూరం కావాల్సిందే..
రావి పండ్లను, ఆకులను మలబద్దకం తగ్గించడానికి కూడా ఉపయోగించవచ్చు. ఆకులను ఎండబెట్టి వాటిని పొడిగా చేయాలి. దానికి సోంపు గింజలు, బెల్లం సమపాళ్లలో కలపాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసు నీళ్లలో కలిపి తాగడం వల్ల మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. రోజుకు 5-10 రావి పండ్లను తిన్నా సమస్య పూర్తిగా దూరం అవుతుంది
లైంగిక సామర్థ్యం పెంపొందడానికి..
నపుంసకత్వం సమస్య నుంచి బయటపడటానికి కూడా రావి ఉపయోగపడుతుంది. అర స్పూన్ రావి పండ్ల పొడిని పాలలో కలిపి రోజుకు మూడుసార్లు తీసుకోవాలి. తద్వారా శరీరానికి బలం వచ్చి, నపుంసకత్వం నుంచి బయటపడొచ్చు. తగిన మోతాదులో రావి పండ్లు, దాని వేర్లు, శొంఠిని కలపాలి. పాలు, తేనె, పట్టిక మిశ్రమానికి దీన్ని కలిపి తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.
రావి చెట్టు దుష్ప్రభావాలు : -
తగిన మోతాదులో ఉపయోగించినప్పుడు రావి సాధారణంగా సురక్షితంగా పరిగణించబడుతుంది. అయినప్పటికీ, కొందరు వ్యక్తులు రావి ని సేవించినప్పుడు కొన్ని దుష్ప్రభావాలను అనుభవిస్తారు. రావి సేవనం వల్ల కలిగే దుష్ప్రభావాలు క్రింద వివరించబడ్డాయి.
- రావి చెట్టు చెట్టు ఆకు సారాన్ని (రసం), ఒక నెల వరకు ఔషధ మోతాదుల్లో సేవించినపుడు సాధారణంగా సురక్షితం. అయినప్పటికీ, అధిక మోతాదులో వినియోగిస్తే, రావిచెట్టు యొక్క రబ్బరు పాలు (latex) కొందరు వ్యక్తులలో జీర్ణవ్యవస్థలో రక్తస్రావాణ్ని కలిగిస్తుంది. రావి చెట్టు సారాన్ని తీసుకోవటానికి ముందు వైద్యుడి సలహాను తీసుకోవడం మంచిది.
- రావిచెట్టు యొక్క సారాన్ని సేవించడంవల్ల కొంతమందిలో సూర్యుని పట్ల (ఎండకు) సున్నితత్వాన్ని కలిగిస్తుంది. అందువల్ల చర్మానికి రావిచెట్టు సారాన్ని పూసుకున్న వెంటనే ఎండలో బయటకు రావడం మంచిది కాదు.
- రావిచెట్టు పండ్లు చర్మానికి అంటడంవల్ల కొంతమంది వ్యక్తులలో చర్మంపై దద్దుర్లు లేదా అలెర్జీలు కూడా సంభవించేందుకు కారణం కావచ్చు. అదనంగా, సహజమైన రబ్బరు పాలకు సున్నితంగా ఉండే వ్యక్తులు అత్తి చెట్లకు లేదా అత్తి పండ్లకు అలెర్జీ ప్రతిచర్యలు కలిగి ఉండవచ్చు.
- గర్భిణీలు మరియు చంటి పిల్లలకు పాలిచ్చే తల్లులు రావిచెట్టు సారాంశాల సేవనంవల్ల కలిగే ప్రభావం గురించి తెలిపే అధ్యయనాలు ఏవీ లేవు. కనుక, అటువంటి మహిళలలు రావిచెట్టు సారాంశాలు కల్గిన మందుల్ని ఉపయోగించేందుకు ముందుగా వైద్యుడిని సంప్రదించడం మంచిది.
- రావి చెట్టు చక్కెరవ్యాధి (డయాబెటిక్)కి వ్యతిరేక ప్రభావాలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. రావిచెట్టు పదార్ధాల నుండి తయారైన మందుల్ని సేవించేవారు తమ రక్తంలో చక్కెర స్థాయిలను సమయానుసారంగా పర్యవేక్షించవలసి ఉంటుంది. శస్త్రచికిత్సా సమయంలో లేదా తర్వాత ఇటువంటి రావిచెట్టు సారాలతో కూడిన మందుల వాడకం రక్తంలో చక్కెర స్థాయిలను దెబ్బ తీస్తుంది. అందువల్ల, శస్త్రచికిత్సకు ముందు కనీసం రెండు వారాల పాటు రావిచెట్టు సారాంశాల్ని ఉపయోగించకుండా ఉండాలని మీకు సలహా ఇవ్వడమైంది.
No comments:
Post a Comment